నీబలం నీకు తెలుసా?
(పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడు”. న్యాయా 6:12)
యెహోవా దూత ప్రత్యక్షమై, “పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడు” అని చెప్పినప్పుడు గిద్యోనుకు ఎంత ఆశ్చర్యం కలిగివుంటుంది.
న్యాయాధిపతుల గ్రంధం 6 అధ్యాయములో సంగతులు చూస్తే చీకటి దినములు అవి, ఇశ్రాయేలు ప్రజల జీవితాలు, ఆత్మీయ అంధకారం కమ్ముకున్న దినములు అవి, పాపం దేవుని ప్రజలను బానిసలుగా చేసింది..
శత్రువులైన మిద్యానియులు మిడతల దండువలె అసంఖ్యాకంగా ఉండి, పచ్చని పొలాలను పాడుదిబ్బలుగా చేస్తున్నారు.
ఆ సమయంలో ఇశ్రాయేలీయులు దుర్భర స్థితిలో ఉన్నారు. ఏడు సంవత్సరాలపాటు, విత్తిన విత్తనాలు మొలకెత్తడం మొదలెట్టిన వెంటనే మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున ఉండే వాళ్ళు ఒంటెలపై గుంపులు గుంపులుగా వచ్చి దేశాన్ని దోచుకునేవారు.
దాడిచేస్తున్నవారి పశువులు పచ్చిక మైదానాల్లోపడి పచ్చనిదంతా మేసేసేవి. కానీ ఇశ్రాయేలీయులకు గాడిదలు లేవు, ఎద్దులు లేవు, గొఱ్ఱెలు లేవు. మిద్యానీయుల భయం ఎంతగా ఆ ఉండేదంటే నిరుపేదలైపోయిన ఇశ్రాయేలీయులు పర్వతాలను, గుహలను, చొరబడడానికి కష్టమైన ప్రాంతాలను ఆశ్రయించేవారు.
శత్రువులకు భయపడి
ద్రాక్షగానుగలో రహస్యంగా ధాన్యం నూరుస్తున్న గిద్యోను తాను పరాక్రమశాలినని ఎంత మాత్రం భావించి ఉండక పోవచ్చు. గిద్యోనుకు *తన బలం తనకే తెలియని పరిస్థితులలో ఉన్నాడు*. అవును ప్రియ దేవుని బిడ్డా! ఒక్కొక్కసారి నీబలం నీకే తెలియని పరిస్థితిలో నీవుంటున్నావు.
దేవుని మాటలు గిద్యోనుకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గిద్యోను ఇశ్రాయేలులో పరాక్రమముగల నాయకుడు కాగలడని దేవునికున్న నమ్మకాన్ని సూచిస్తున్నాయి. అయినా కూడా ఆ విషయం గురించి గిద్యోనుకు నమ్మకం లేదు.
ఆనాటి సంగతులు నేటి మన జీవితాలకు ఆత్మీయ పాఠాలుగా వున్నాయి. ఆనాటి వారి జీవితాలలో ముఖ్యంగా మూడు సమస్యలు కనిపిస్తాయి. నాయ్యా 6:2
మొదటిది, ఇశ్రాయేలు శ్రమలో వున్నారు. ఆనందం వారిలోలేదు .మిద్యానియుల అధిపత్యం వుంది, వారి స్వంత స్థలంలోనే వారు దాసులుగా బ్రతుకుతున్నారు.
రెండవది, న్యాయా 6:13 వారి జీవితాలలో, దేవుని గొప్ప కార్యాలు కేవలం ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అది చరిత్రగానే మిగిలి పోయింది, దేవుడు వారి జీవితాలలో కార్యం జరిగించట్లేదు. గిద్యోను అదే మాట అన్నాడు.
మూడవది, న్యాయా 6:3 వారు కస్టపడి పని చేస్తున్నారు. కాని ఫలితం లేని సేవ. కష్టించి పనిచేస్తున్నారు, కాని శత్రువు ఎత్తికొని పోతున్నాడు. కష్టించిన ఫలితం లేదు. కరువులోనే బ్రతుకుతూనే వున్నారు. వారి జీవనోపాధి దొంగిలించబడింది.
పై మూడు సంగతులు నాటి ఇశ్రాయేలీయుల సంఘంలోనే కాదు. నేటి సంఘాలలో విశ్వాసుల జీవితాలలో దుస్థితి ఇది.
1. అనందం లేదు: మన స్వస్థలంలోనే, సంఘాలలో వుంటూ నెమ్మది ఆనందం అనుభవించ లేక పోతున్నాం.
2. ఘనమైన జీవితంలేదు: సంఘాలలో సేవలో, దేవుని గొప్ప కార్యాలు, జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి, ఎప్పుడో భక్తుల జీవితాలలో దేవుడు అలాచేసాడు, సేవ అలా జరిగింది, ఇలాంటి కార్యాలు జరిగాయి, అని చరిత్రలు చెప్పుకొని ఆనందిస్తున్నాము. కాని మన జీవితాలలో దేవుడు కార్యాలు నాడు చేసినట్టు నేడు చేస్తున్నాడా? కారణమేమి? అది ఆయన లోపం కాదు, మన లోపమే.
3. వృధా ప్రయాస: కష్టపడి సేవ చేసినా, ప్రయాసపడినా, ఫలాన్ని, ఫలితాన్ని శత్రువు ఎత్తుకు పోతున్నాడు. సేవ ఫలం కనిపించటం లేదు.
అలాంటి దినములలో దేవుడు లేపుకొన్న వ్యక్తి గిద్యోను. ఎందుకు గిద్యోనునే లేపాడు? ఒక్కడు ఏమి చేయగలడు? ఉజ్జీవం ఎప్పుడు ఒక్కరితోనే ప్రారంభం అవుతుంది.ప్రభువుకు నమ్మకమైన వారు ఒక్కరు చాలు.
గిద్యోను, మిద్యానీయులపై దాడి చేయడంలో దేవుడు తనకు తోడై ఉంటాడని చూపించే సూచన ఇవ్వమని అడిగాడు, హామీ ఇవ్వమని ఆయన సహేతుకంగా అడిగినదాని ప్రకారం చేయడానికి ప్రభువు సుముఖత చూపించాడు.
కాబట్టి తనను చూడడానికి వచ్చిన దూతకు గిద్యోను ఆహారమును అర్పణముగా అర్పించినప్పుడు ఆ రాతిలో నుండి అగ్ని వచ్చి ఆ అర్పణను దహించివేసింది. యెహోవా గిద్యోను భయాన్ని పోగొట్టిన తర్వాత, ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం కట్టాడు. న్యాయా 6:12-24.
గిద్యోనులో దేవుడు చూసిన లక్షణాలు ఏమిటి? గిద్యోనులో వున్నా విశేషతలు ఏమిటి?
1. అంగీకరించబడిన జీవితం:- న్యాయా 6:17- 21 వరకుచదవండి. "అందుకతడు నాయెడల నీకు కటాక్షము కలిగిన యెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవేఅని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము."
సూచన ఎందుకు అడిగాడు, గిద్యోను. అద్బుతం చేయమని కాదు, అగ్ని పంపమని కాదు. అందులో పాఠం వుంది, అతని బలిని ప్రభువు అంగీకరించాలని సూచన అడిగాడు.
గిద్యోను దేవుణ్ణి పరిక్షించలేదు, కాని తన జీవితాన్ని పరీక్షించు కున్నాడు. తన జీవితం బలి, అర్పణ దేవునికి అంగీకరమా కాదా, అని పరీక్షించు కున్నాడు.
కయీను అర్పణ తెచ్చాడు కాని అంగీకరించ బడక పోవటానికి కారణం అతని జీవితమే.
ప్రియులారా! మన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా?మన జీవితాలు ఆయన ఎదుట పెడితే అవి అమోదయోగ్య మైనవేనా?
కీర్తన 139:23-24 దావీదు నేరుగా దేవుణ్ణి అడిగాడు. నన్ను పరీక్షించు అని. నీ రహస్య జీవితం ఎలావుంది, నీవు ఎవరివైనా ... ఆయనకు లెక్క లేదు, ఈ రోజుల్లో ఆయనకు అవసరమైన వారు అట్టి వారే...
దేవుడు గిద్యోను అర్పణ అంగీకరించాడు. కాబట్టి ఒక్కడే అయినా దేవుని కొరకు, ఉపయోగించ బడ్డాడు. నీ రహస్య జీవితన్ని బహిరంగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆయన స్వీకరించాలి. అలా ఉన్నాయా మన జీవితాలు? అలా వుంటే ఎందుకు మనలను ఆయన ఉపయోగించడు..?
2. సాక్ష్యం తో కూడిన జీవితం:- న్యాయా 6:25-28 ఆ రాత్రే దేవుడు గిద్యోనుకు ఒక సవాలునిచ్చాడు, దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టుట మాత్రమే కాదు, తన తండ్రి కట్టిన బయలు దేవతా స్థంబాన్ని నరికి వేయమన్నాడు.
మన ఇంటిలో ఎదో ఒకటే వుండాలి, రెండు తలంపుల మధ్య, రెండు స్థలాలలో ఉండరాదు. ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావాలి, మార్పు చెందిన రాత్రే, తన జీవితంలో తన ఇంటిలో లోకసంభందమైనవి పడగొట్టగలగాలి. అవి మన పితరులవైన మన ప్రియులవి అయిన వాటిని పడగొట్టా గలగాలి.
తన జీవితంలో మార్పు కలిగిన ఆ రాత్రే ఆ కార్యం చేసాడు. ఆ కార్యాలు నెమ్మదిగా చేసేవి కాదు. వెంటనే చేయాల్సిన కార్యాలు అవి. ఇక నుంచి నేను బయలు వాడను కాను, ఇక నుంచి నేను ప్రభువుకు చెందిన వాడను, అని నిరూపించాలి అంటే లోకాశలు పడగొట్టాలి.
తానెవరో ఆ దినాన తేలి పోవాలి, ప్రజలందరికి నీవేవరవో తెలియాలి. ప్రభువు కొరకై తెగింపు కావాలి. ఎవరికీ భయపడక, రోషము పూని కార్యాలు చేయాలి, కులము అనే దేవతా స్థంబాలు, ఆచారాలు అనే బలిపీఠములు, వాక్యానికి బిన్నమైన బోధలు అనే దేవతా స్తంభాలు, పడగొట్టుటకు సిద్దంగా వున్నామా?
మనం ప్రభువు వారం అని ప్రపంచానికి తెలియాలి. నోటి మాటలు కాదు, జీవితాల ద్వారా ప్రభువు దాసులమని ఋజువు చేద్దాం.
3. ఆత్మతో నిండిన జీవితం:- న్యాయా 6:33-40. పరిశుద్ధాత్మతో నడిపింప బడినవాడు గిద్యోను. భక్తుల శక్తి రహస్యం ఇదే
ప్రియులారా! నేటి దినములలో పనివారికి కొదువ లేదు. కాని ఆత్మతో నడిపింప బడుతున్న వారు చాల తక్కువ. పరిశుద్దత్ముడు మన హృదయాలలో కుమ్మరింప బడ్డాడు కాని పరిశుద్దాత్మ స్వతంత్రత క్రింద ఎందరం వున్నాం?
మనుష్యులను సంతోష పెట్టుటలో మునిగి ఉన్నాము. మనలను నడిపిస్తున్నది మనుష్యులు, గుంపులు, కుటుంబాలు. మనము ఎవరి చేత నడిపింప బడుతున్నాము? అపోస్తలుల కార్యములు 6:10
మనుష్యులకు భయపడ కూడదు. స్తెఫను ధైర్యానికి కారణం అతడు ఆత్మపూర్ణుడు కావటమే. స్తెఫను నిర్భయంగా మాట్లాడాడు. మనం కూడా ప్రభువు ప్రకటించమన్నది నిర్భయంగా ప్రకటిద్దాం.
అపోస్తలుల కార్యములు 16:6-10 పౌలు పరిశుద్దత్మకు విధేయత చుపినందుననే , మాసిదోనియలో సంఘాలు, ఏర్పడ్డాయి. వారు పరిశుద్ధాత్మచే నడిపించ బడ్డారు. మనుష్యులచే కాదు, వారి శరీరంచే కాదు, బంధువులు స్వజనులచే కాదు, పరిశుద్దత్ముడు వారిని నడిపించాడు.
తదుపరి దేవుడు గిద్యోనును అద్భుతమైన రీతిలో ఎలా వాడుకున్నాడో మనకు తెలుసు. గిద్యోను గురించిన వృత్తాంతం నుండి మనం ప్రోత్సాహం పొందవచ్చు, ఎందుకంటే ఎంతో బలహీనంగా లేదా నిస్సహాయంగా కనిపించేవారిని ఉపయోగించి కూడా దేవుడు తన ప్రజలను ఎలాంటి ప్రమాదం నుండైనా తప్పించగలడని అది నిరూపిస్తోంది.
గిద్యోను 300 మందితో లక్షల మంది మిద్యానీయులను నాశనం చేయగలగడం దేవుని అనంతమైన శక్తికి నిదర్శనంగా ఉంది. మనం చాలా దుర్భరమైన స్థితిలో ఉండి, మన శత్రువులకన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉండవచ్చు. అయినప్పటికీ, గిద్యోనుకు సంబంధించిన బైబిలు వృత్తాంతం దేవుని మీద విశ్వాసం ఉంచమని మనల్ని ప్రోత్సహిస్తోంది.
ఆయన తనపై విశ్వాసం ఉంచేవారందరినీ ఆశీర్వదించి, విడిపిస్తాడు. మనం కూడా ప్రభువుకు అప్పగించుకొని *మన బలం* మనం తెలుసుకొని పరిశుద్దాత్మ ద్వారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేద్ధాం!
దైవాశ్శీసులు!!
(Soli Deo Gloria)
Comments
Post a Comment